: ఈ మూడు రకాల స్నేహితులు ప్రతి ఒక్కరికీ ఉండాలి!
ఎంతమంది స్నేహితులను కలిగి ఉండాలన్న దానిపై ఎలాంటి పట్టింపులు లేవు కానీ, ఎలాంటి వ్యక్తులను స్నేహితులుగా కలిగి ఉండాలన్న విషయంలో మాత్రం జాగ్రత్తగా వ్యవహరించక తప్పదు. ముఖ్యంగా మూడు రకాల స్నేహితులను కలిగి ఉండడం ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరమంటున్నారు సామాజికవేత్తలు. విశ్వసనీయులు, కష్టాల్లో ఆసరా ఇచ్చేవాళ్ళు, బాధలను మరిపించి మన ఆనందాన్ని ఇనుమడింప చేసేవారితో స్నేహం లాభిస్తుందంటున్నారు. ప్రతి చిన్న అంశంలోనూ మనతో నిరంతరం టచ్ లో ఉండేవాళ్ళను వదులుకోరాదు. అది కష్టమైనా, ఆనందించాల్సిన విషయమైనా ఇలాంటి వ్యక్తులు మన వెన్నంటే ఉంటారు. నిరాశాభరితంగా ముగిసిన రోజు చివర్లో ఈ తరహా స్నేహితుడు మన చెంత ఉంటే బాగుండునని తప్పక భావిస్తాం. విచారంలో, విషాదంలో ఓదార్చే మిత్రుడు ఒకరుండాలి. మన బాధల్ని మరిపించి, మురిపించే హితుడు ఒకరుంటే అంతకంటే ఇంకేం కావాలి? చుట్టూ కారుమబ్బుల్లా కష్టాలు కమ్ముకున్న వేళ, పాజిటివ్ థాట్స్ తో మీరు ముందడుగు వేయాలనుకున్న వేళ... చీకట్లో కాంతిరేఖలాంటి స్నేహితుడు అవసరమవుతాడు. మనల్ని ఎల్లప్పుడూ ఉల్లాసంలో ముంచెత్తే నేస్తం ఒకరుంటే ఆ హాయే వేరు. విషాదమైనా, మరే కష్టమైనా... ఇలాంటి వ్యక్తి సాన్నిహిత్యంలో అన్నీ మర్చిపోవచ్చు. తన హాస్య చతురతతో ఇట్టే నవ్వించి... సంతోష సాగరంలో ఓలలాడిస్తాడు. మీరు ఏ మూడ్లో ఉన్నా... వీరితో మాట్లాడిన వెంటనే ఓ స్మైల్ ఇస్తారు.