: అందరికీ పీఎం ఉంటే, మనకి ఈఎం ఉన్నారు: మోడీపై అయ్యర్ సెటైర్లు


రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ ప్రధాని నరేంద్ర మోడీపై సెటైర్లు వేశారు. ఇతర దేశాలకు పీఎం ఉంటారని, మనకు మాత్రం ఈఎం ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈఎం అంటే ఈవెంట్ మేనేజర్ అని ఆయనే విశదీకరించారు. మోడీ అమెరికా పర్యటనను ఉద్దేశించి అయ్యర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మోడీ ఆ పర్యటనలో గోరంత సాధిస్తే, ప్రవాస గుజరాతీలు దాన్ని కొండంతలు చేసి చెబుతున్నారని విమర్శించారు. ఇక, స్వచ్ఛ భారత్ అభియాన్ లో భాగంగా చీపురు పట్టి, ఓ చెత్తకుండీ వద్ద నిలబడి, 21వ శతాబ్దపు గాంధీలా ఫొటోలకు పోజులివ్వడం మోడీకే చెల్లిందని ఎద్దేవా చేశారు. ఇలాంటి పథకాలను కాంగ్రెస్ ఎన్నడో ప్రవేశపెట్టిందన్న అయ్యర్... కాంగ్రెస్ రూపొందించిన పథకాలకు కాషాయ రంగు పులుముకుంటున్నారని కమలనాథులకు చురక అంటించారు. ఇప్పటికే నిర్మల్ భారత్ అభియాన్ పథకం అమల్లో ఉందని, దాన్ని పూర్తిగా పక్కనబెట్టి, స్వచ్ఛ భారత్ అభియాన్ తెరపైకి తెచ్చారని ఆరోపించారు. స్వచ్ఛ భారత్ తరహా పథకాన్ని 1999లోనే వాజ్ పేయి నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు ప్రవేశపెట్టిందని, అప్పట్లో దాని పేరు టోటల్ శానిటైజేషన్ కాంపెయిన్ (టీఎస్ సీ) అని ఆయన వెల్లడించారు. గత ఎన్డీయే హయాంలో ప్రవేశపెట్టిన పథకాలను నొక్కేయడానికి కూడా మోడీ వెనకాడడం లేదని అయ్యర్ విమర్శించారు.

  • Loading...

More Telugu News