: ఈ రిక్షావాలాకు జిందాబాద్ అనాల్సిందే!


సైకిల్ తొక్కడానికే కొందరు ఆపసోపాలు పడుతుంటారు. మూడు చక్రాలుండే రిక్షా తొక్కాలంటే ఇంకాస్త శ్రమించాల్సిందే. అదే, రిక్షా వేసుకుని 3000 కిలోమీటర్లు ప్రయాణించాలంటే.. వామ్మో... ఎంత కష్టం..! కానీ, కోల్ కతాకు చెందిన రిక్షావాలా సత్యేన్ దాస్ (44) సంకల్పం ముందు వేల కిలోమీటర్ల దూరం కూడా చిన్నబోయింది. కోల్ కతాలో మొదలైన దాస్ యాత్ర 68 రోజుల పాటు సాగింది. జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, శ్రీనగర్, కార్గిల్ మీదుగా దాస్ ప్రయాణించాడు. ఆగస్టు 17న లడఖ్ లోని సుప్రసిద్ధ ఖర్దుంగ్ లా పాస్ చేరుకున్న దాస్ ఇటీవలే కోల్ కతా తిరిగొచ్చాడు. ప్రస్తుతం తన రిక్షా యాత్రకు గిన్నిస్ బుక్ లో చోటు దక్కుతుందేమోనని చూస్తున్నాడు. తాను జమ్మూకాశ్మీర్లోని పఠాన్ కోట్ ప్రాంతంలో ప్రయాణిస్తుండగా, తామెన్నడూ రిక్షాను చూడలేదని స్థానికులు చెప్పారని దాస్ తెలిపాడు. పర్యావరణహిత వాహనంగా రిక్షాకు ప్రాచుర్యం కల్పించడమే తన యాత్ర ముఖ్యోద్దేశమని ఈ బెంగాలీ పేర్కొన్నాడు. అంతేగాకుండా, ప్రపంచశాంతి సందేశాన్ని వ్యాపింపజేయడం కూడా తన ఉద్దేశాల్లో ఒకటని తెలిపాడు. దాస్ తో పాటు ఈ యాత్రలో కోల్ కతాకు చెందిన ఓ డాక్యుమెంటరీ ఫిలిం మేకర్ కూడా పాల్గొన్నాడు. దాస్ యాత్రను అతను రికార్డ్ చేశాడు. వివిధ రాష్ట్రాల గుండా ప్రయాణించే క్రమంలో రోడ్ మ్యాప్ ల సాయంతో దాస్ కు సాయపడ్డాడా ఫిలిం మేకర్. దక్షిణ కోల్ కతాకు చెందిన నక్తలా అగ్రాణి క్లబ్ సత్యేన్ దాస్ యాత్రకు ఆర్ధిక సాయం అందించింది. ఈ రిక్షావాలా లాంగ్ ట్రిప్ వేయడం ఇదే మొదటిసారి కాదు... 2008లో భార్య, కుమార్తెను రిక్షాలో ఎక్కించుకుని హిమాచల్ ప్రదేశ్ లోని రోహ్ టాంగ్ పాస్ చేరుకోవడం విశేషం.

  • Loading...

More Telugu News