: విశాఖలో వన్డే మ్యాచ్ ను అడ్డుకుంటాం: ఉత్తరాంధ్ర పొలిటికల్ జేఏసీ హెచ్చరిక
టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య విశాఖపట్నంలో ఈ నెల 14న వన్డే మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ మ్యాచ్ ను అడ్డుకుంటామని ఉత్తరాంధ్ర రాజకీయ జేఏసీ హెచ్చరిస్తోంది. ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, లేకుంటే, విశాఖలో జరిగే వన్డే మ్యాచ్ ను అడ్డుకుని తీరతామని జేఏసీ ఛైర్మన్ జేటీ రామారావు కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ఈ మేరకు విశాఖలో గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టు, స్టీలు ప్లాంట్ కు సొంత గనులు, ఐఐటీ, విశాఖ రైల్వే జోన్, హైకోర్టు తదితర అంశాలు కేంద్రం పరిధిలో ఉన్నాయని, వీటి మంజూరు విషయంలో కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలని రామారావు డిమాండ్ చేశారు. ఏటా రూ.35 వేల కోట్లు పన్నుల రూపంలో చెల్లిస్తున్నా, ఇక్కడి వారికి మిగిలింది కన్నీళ్ళేనన్నారు. తమ డిమాండులను నెరవేర్చకపోతే క్రికెటర్లు బస చేసే హోటళ్ళ వద్ద, విమానాశ్రయం వద్ద, మైదానంలోనూ ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.