: ఈ-కామర్స్ సంస్థలతో కొంప కొల్లేరేనా?
అమెజాన్.కామ్, ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్, గోఐబిబో... ఈ-కామర్స్ లో దినదినాభివృద్ధి చెందడంతో పాటు మనం కోరుకున్న వస్తువులను ఇంటిముంగిట్లోనే దించేస్తున్నాయి. సదరు సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారికి గంటల లెక్కన లాభాలను ఆర్జించి పెడుతున్నాయి. కొనుగోళ్లనూ పెంచేస్తున్నాయి. అన్నీ మంచి పరిణామాలే కదా! మరి కొంప కొల్లేరెందుకు? వినియోగదాలకు బాగానే ఉంది, ఈ-కామర్స్ సంస్థలకూ బాగానే ఉంది. ఎటొచ్చి వస్తు తయారీ సంస్థలు, చిల్లర వర్తకులకే ముప్పు పొంచి ఉంది. నానాటికీ వృద్ధి బాటలో పయనిస్తున్న ఈ-కామర్స్ సంస్థలు, తమ బ్రాండ్ ఇమేజీనీ డ్యామేజీ చేస్తున్నాయని వస్తు తయారీదార్లతో పాటు రీటెయిలర్లు వాపోతున్నారు. ఎందుకంటే, ఈ-కామర్స్ సంస్థల రంగ ప్రవేశంతో వినియోగదారులు బయటికి రావడమే మానేశారు. అంతేకాక భారీ ఎత్తున డిస్కౌంట్లను ప్రకటిస్తున్న ఈ-కామర్స్ సంస్థలు వినియోగదారులను తమ సైట్లలోనే కట్టిపడేస్తున్నాయి. దీంతో ఆయా కంపెనీ ఉత్పత్తుల పేర్లను మరిచిపోతున్న వినియోగదారుడు, ఈ-కామర్స్ నామస్మరణ చేస్తున్నాడు. ఇక వినియోగదారులు ఇంటికే పరిమితమవుతున్న నేపథ్యంలో రీటెయిల్ షాపులన్నీ వెలవెలబోతున్నాయి. ఈ కారణంగానే తమ బ్రాండ్ ఇమేజీ పోయినా ఫర్వాలేదనుకుంటే, తాజాగా రీటెయిలర్ల జీవనోపాధి కూడా ప్రశ్నార్థకంగా మారిందని దిగ్గజ తయారీదారులు మధనపడుతున్నారు.