: కుల్దీప్ యాదవ్ ఎంపికపై గంగూలీ స్పందన
ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కూడా ఆడకుండానే టీమిండియా బెర్తు దక్కించుకున్న 'చైనామన్' స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఇప్పుడు భారత క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్. విండీస్ తో వన్డే సిరీస్ కు ఈ ఉత్తరప్రదేశ్ యువకిశోరం ఎంపికపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. పెద్దగా అనుభవం లేని కుల్దీప్ ను భారత జట్టులోకి తీసుకోవడం సాహసోపేత నిర్ణయం అనడంలో సందేహం లేదని పేర్కొన్నాడు. అయితే, కుల్దీప్ మంచి స్పిన్నర్ అని, విండీస్ తో వన్డేల్లో రాణిస్తాడని అభిప్రాయపడ్డాడు. బౌలర్ల ఎంపిక వారు ఎంత మెరుగ్గా బౌలింగ్ చేస్తున్నారన్న దానిపై ఆధారపడి ఉంటుందని భావిస్తున్నానని దాదా తెలిపాడు. చైనామన్ బౌలింగ్ శైలి అంటే... లెఫ్టార్మ్ స్పిన్నర్ బంతిని కుడిచేతి వాటం బ్యాట్స్ మన్ లోపలికి టర్న్ చేస్తాడు. సంప్రదాయ లెఫ్టార్మ్ స్పిన్నర్లు బంతిని కుడిచేతి వాటం బ్యాట్స్ మన్ బయటికి వెళ్ళేలా టర్న్ చేస్తారు. అంటే, పిచ్ చేసిన బంతి స్లిప్స్ దిశగా వెళుతుందన్నమాట. చైనామన్ బౌలింగ్... వెస్టిండీస్ అలనాటి బౌలర్ ఎలిస్ పుస్ అచాంగ్ పేరిట వాడుకలోకి వచ్చింది. అచాంగ్ చైనా సంతతి కరీబియన్. అప్పటిదాకా సంప్రదాయ లెఫ్టార్మ్ స్పిన్ కు అలవాటు పడిన ప్రపంచ క్రికెటర్లకు అతని బౌలింగ్ శైలి కొరుకుడు పడలేదు. 1933లో మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్, విండీస్ జట్ల మధ్య జరిగిన టెస్టు ద్వారా చైనామన్ బౌలింగ్ శైలి ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ మ్యాచ్ లో అచాంగ్ విసిరిన బంతికి ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ వాల్టర్ రాబిన్స్ నిరుత్తరుడయ్యాడు. బంతిని అర్థం చేసుకోవడంలో విఫలుడై స్టంపౌట్ అయ్యాడు. పెవిలియన్ కు వెళుతూ రాబిన్స్ అంపైర్ తో "ఆ బ్లడీ చైనామన్ ఎంత పనిచేశాడు?" అని వ్యాఖ్యానించాడు. అప్పటినుంచి ఆ తరహా విలక్షణ బౌలింగ్ కు చైనామన్ స్పిన్ అని పేరొచ్చింది.