: జయ ఆభరణాలు కొన్నారు...రసీదులు మాత్రం తీసుకోలేదట!
అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత భారీ ఎత్తున ఆభరణాలు కొనుగోలు చేసిన సంగతి జగమెరిగిన సత్యమే. అయితే, ఆ ఆభరణాల కొనుగోలు సందర్భంగా ఒక్కటంటే ఒక్క రసీదు కూడా ఆమె తీసుకోలేదట. ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ, రసీదులు లేకుండా పెద్ద ఎత్తున ఆభరణాలు కొనుగోలు చేసిన జయలలిత, అక్రమాస్తుల కేసులో విలువైన ఆభరణాల విలువ చెప్పే సమయంలో నీళ్లు నమిలారు. పరప్పన అగ్రహార కేంద్ర కారాగార కోర్టు న్యాయమూర్తి జాన్ మైఖేల్ డికున్హా వెల్లడించిన తీర్పులో ఈ అంశాలు వెలుగు చూశాయి. ఆశ్చర్యకర విషయమేంటంటే, తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన జయలలిత, ఐదేళ్లలో 13 కేజీలకు పైగా బంగారు ఆభరణాలను కొనుగోలు చేశారు. సీఎం పదవి చేపట్టడానికి ముందు 7 కిలోల బంగారు ఆభరణాలున్నట్లు ప్రకటించిన జయలలిత, పదవి నుంచి దిగిపోయేనాటికి 20.54 కిలోల బంగారు ఆభరణాలను ప్రకటించారు. నగల వ్యాపారులను ఇంటివద్దకే పిలిపించుకునే జయలలిత అనుచరులు, ఆభరణాలను కొనుగోలు చేయడం, డబ్బు చెల్లించడానికే పరిమితమయ్యారు. అయితే ఏ ఒక్క సందర్భంలోనూ వారు రసీదును అడిగిన పాపానపోలేదు.