: మోడీ విమానంలో డమ్మీ గ్రెనేడ్...నలుగురు ఎయిర్ ఇండియా అధికారుల సస్పెన్షన్
అమెరికా పర్యటనలో మోడీ బృందానికి స్టాండ్ బై విమానంగా కొనసాగిన ఎయిర్ ఇండియా విమానంలో డమ్మీ గ్రెనేడ్ వెలుగు చూసిన ఘటన నలుగురు ఎయిర్ ఇండియా ఉద్యోగుల సస్పెన్షన్ కు దారితీసింది. సస్పెన్షన్ కు గురైన వారిలో ఇద్దరు ముంబై కి చెందిన వారు కాగా, ఇద్దరు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న, ఎయిర్ ఇండియా అధికారులున్నారు. అసలు సదరు డమ్మీ గ్రెనేడ్ విమానంలోకి ఎలా వచ్చిందంటే, మాక్ డ్రిల్ సందర్భంగా ఎన్ఎస్ జీ కమెండోలు ఆ విమానంలో కసరత్తులు చేశారు. భద్రతా చర్యల్లో భాగంగా వారు పలు ఆయుధాలను కూడా వాడారు. ఈ క్రమంలోనే వారు వాడేసిన గ్రెనేడ్ విమానంలో మిగిలిపోయింది. అయితే ముంబైలో విమానాన్ని చెక్ చేసిన అధికారులు దీనిని గుర్తించలేకపోయారు. హైదరాబాద్ లో తనిఖీ జరిగినా ఈ గ్రెనేడ్ సెక్యూరిటీ అధికారుల కంటబడలేదు. దీంతో రెండు ప్రాంతాల్లో విమానాన్ని తనిఖీ చేసిన నలుగురు అధికారులను సస్పెండ్ చేస్తూ పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు నిర్ణయం తీసుకున్నారు.