: ఫేస్ బుక్ కు పోటీదారు ‘‘ఎల్లో’’నేనా?
సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ కు చాలా కాలం తర్వాత పోటీదారు రంగంలోకి దిగింది. ‘ఎల్లో’ పేరిట ఇప్పుడిప్పుడే తెరమీదకు వస్తున్న ఈ సైట్ లో గంటకు 45 వేల మంది కొత్త వినియోగదారులు చేరుతున్నారు. కొలరాడో కేంద్రంగా అరగేంట్రం చేసిన ఎల్లోకు పాల్ బుడ్నిజ్ నేతృత్వం వహిస్తున్నారు. ఫేస్ బుక్ లో మాదిరిగా తమ సైట్ ప్రకటనకర్తకు వేదిక కాదని, అసలు ప్రకటనలే తమ సైట్ లో కనిపించవని చెబుతున్న పాల్, ఎల్లో సేవలను మాత్రం వినియోగదారులు ఉచితంగానే అందిస్తానని చెబుతున్నారు. అయితే, ఇది ఎలా సాధ్యమన్న విషయాన్ని మాత్రం పాల్ వెల్లడించడం లేదు. దీంతో ఈ సైట్ లో చేరిన చాలా మంది అనతికాలంలోనే అందులో నుంచి వైదొలగుతున్నారు. అంతేకాక అప్పటికే ఆ సైట్ లో సభ్యత్వం ఉన్న వారు ప్రతిపాదిస్తేనే మనకు సభ్యత్వం లభిస్తుంది. అయితే ఎల్లో ఫ్రెండ్స్ లేని వారు నేరుగా హోమ్ పేజ్ ను కూడా సందర్శించి సభ్యత్వం పొందే వీలుంది. సభ్యత్వం తీసుకునేందుకే ఇన్ని అవాంతరాలు ఎదురవుతుంటే, ఇక ఎల్లో, ఎలా ఫేస్ బుక్ కు పోటీదారు అవుతుందని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు.