: ‘మహా’ సంగ్రామంలో ఉచిత హామీల వెల్లువ!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉచిత హామీల వరద పారనుంది. రాష్ట్రంలో ప్రజల భావోద్వేగాలతో మమేకమైన శివసేన కూడా ఈసారి ఉచిత హామీలనే ఆశ్రయించింది. ఎన్నికల మేనిఫెస్టోకు తుది రూపు దిద్దుతున్న ఆ పార్టీ, ఉచిత వరాలను కురిపించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఉచితంగా మొబైల్ ట్యాబ్లెట్ ను అందించడంతో పాటు దానికి అవసరమైన నెట్ సౌకర్యాన్ని కూడా ఉచితంగా అందిస్తామని చెబుతోంది. రాష్ట్రాన్ని డిజిటల్ నెట్ హబ్ గా మార్చేందుకే ఈ తరహా చర్యలు తీసుకుంటున్నట్లు కూడా ప్రకటించింది. ఉచితంగా ట్యాబ్లెట్ ల పంపిణీతో పాటు పరిమితులు లేని నెట్ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ఆ పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. దేశంలోనే ఈ తరహా కార్యక్రమం ఇదే మొదటిదని చెబుతున్న ఉద్ధవ్, అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. ఉచిత హామీలకు శివసేన తెరలేపడంతో మిగిలిన పార్టీలు కూడా అదే దిశలో హామీలు గుప్పించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.