: నిలకడగా డాలర్ శేషాద్రి ఆరోగ్యం... సీఎం చంద్రబాబు ఆరా
తిరుమల ఓఎస్ డీ డాలర్ శేషాద్రి ఆరోగ్యం నిలకడగా ఉందని టీటీడీ ప్రజాసంబంధాల (పీఆర్ఓ) అధికారి తెలిపారు. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో వైద్యులు ఆయనకు ప్రస్తుతం అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని, మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పారు. మరోవైపు శేషాద్రి ఆరోగ్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. ఆయనకు మెరుగైన సేవలు అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ మధ్యాహ్నం భోజనం తరువాత శేషాద్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొన్నారని టీటీడీ జేఈవో తెలిపారు. ఇప్పుడు కార్డియాలజీ, అత్యవసర విభాగంలో ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. 3 గంటల నుంచి 6 గంటల వరకు వైద్యుల పర్యవేక్షణలో ఉంటారన్నారు. కొంతకాలంగా ఆయన మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారని, నెలక్రితం శేషాద్రి కిడ్నీ సంబంధింత సమస్యలు కూడా ఎదుర్కొన్నారని జేఈవో చెప్పారు.