: అమెరికా పర్యటన నుంచి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలోకి మోడీ!


అమెరికా పర్యటనను ముగించుకుని వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు. శివసేనతో దోస్తీ చెడిన నేపథ్యంలో మోడీ మేనియాను వినియోగిస్తే కానీ, ఆ రాష్ట్రంలో పార్టీ గట్టెక్కే పరిస్థితి లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా భావిస్తున్నారు. దీంతో, వీలయినంత మేర మోడీని వాడుకోవాలని ఆయన నిర్ణయించారు. ఇక, భారత వాణిజ్య రాజధానిగా భాసిల్లుతున్న మహారాష్ట్ర రాజధాని ముంబై మహా నగరంలో మొత్తం 36 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో మెజార్టీ సీట్లు ఎవరికైతే దక్కుతాయో, వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం 2009లో జరిగిన ఎన్నికల్లో ముంబైలో 13 చోట్ల పోటీ చేసిన బీజేపీ ఐదింట విజయం సాధించింది. తాజాగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ, మోడీ చేత ప్రచారం చేయించి మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా నగరం, తూర్పు, పశ్చిమ సబర్బ్ లలో మూడు భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తోంది. ఈ సభల ద్వారా నగర ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు ఆ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసింది. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా 20 ర్యాలీల్లో మోడీ పాల్గొనేలా చేయాలని పార్టీ భావిస్తుండగా, మోడీ 15 సభల్లో పాల్గొనే అవకాశాలే కనిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News