: కేసీఆర్ ప్రభుత్వ పనితీరుపై మాట్లాడబోనన్న చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు బాబును కేసీఆర్ ప్రభుత్వ పనితీరుపై స్పందన కోరారు. కేసీఆర్ సర్కారు పనితీరుపై తాను స్పందించబోనని ఆయన స్పష్టం చేశారు. తాను ఎవరిపైనా విమర్శలు చేయబోనన్నారు. అయితే, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. ప్రభుత్వపరంగా స్నేహపూర్వకంగా ఉంటామని తెలిపారు. తెలంగాణలో టీడీపీ బలంగానే ఉందని బాబు పునరుద్ఘాటించారు. తెలంగాణలో అన్ని సమస్యలకు తననే కారణంగా చూపడం సరికాదని హితవు పలికారు. "తెలంగాణలో ఎరువుల కొరతకు నేను కారణం అంటే ఎలా?" అని బాబు ప్రశ్నించారు. ఎదుటివారిని తిడుతూ కూర్చుంటే ప్రజలు విశ్వసించరని సూచించారు. ప్రజలు మన మాటలకన్నా, చేతలనే ఎక్కువగా గుర్తుంచుకుంటారని అభిప్రాయపడ్డారు. అటు, ఏపీ ప్రభుత్వ కార్యక్రమాల కవరేజి విషయంలో ఏ మీడియా సంస్థపైనా ఆంక్షలు లేవని చంద్రబాబు స్పష్టం చేశారు. సాక్షి, నమస్తే తెలంగాణ పత్రికలను ఎక్కడా అడ్డుకోలేదని చెప్పారు. అయినా, పార్టీల కోసం పేపర్లు పెడతారా? అంటూ ప్రశ్నించారు. అవినీతి సొమ్ముతో పేపర్ పెట్టి విచ్చలవిడిగా రాస్తే ఎలా? అంటూ పరోక్షంగా జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పేపర్లు, టీవీలు పెట్టుకుని కూడా ఎన్నికల్లో గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు. రాజకీయ పార్టీలకు పత్రికలు, టీవీ చానళ్ళు ఉండడం సమంజసం కాదని అన్నారు.

  • Loading...

More Telugu News