: బ్యాంకర్లతో భేటీ వివరాలు తెలిపిన సుజనా


రాష్ట్రస్థాయి బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు భేటీ తాలూకు వివరాలను ఎంపీ సుజనా చౌదరి మీడియాకు తెలిపారు. రుణమాఫీ అమలుకు మరో మూడు రోజుల్లో రైతు సాధికారత కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రూ. 5 వేల కోట్ల నుంచి రూ.7 వేల కోట్లతో ఈ కార్పొరేషన్ నెలకొల్పుతామన్నారు. ఈ ప్రత్యేక కార్పొరేషన్ ద్వారానే బ్యాంకులకు చెల్లింపులు జరుగుతాయని చెప్పారు. ఈ కార్పొరేషన్ ఏర్పాటుకు మంత్రివర్గం త్వరలో ఆమోదం తెలుపుతుందని అన్నారు. ఎన్ని కష్టాలెదురైనా రుణమాఫీ అమలు చేసి తీరతామని స్పష్టం చేశారు. రైతులకు కొత్త రుణాల జారీకి ఎలాంటి ఇబ్బందుల్లేవని తెలిపారు. 10 శాతం వడ్డీతో రైతులకు బాండ్లు ఇస్తామని, బాండ్ల విషయమై రిజర్వ్ బ్యాంకుతో చర్చిస్తామని చెప్పారు. ఇప్పటికే రుణమాఫీ కోసం రూ.5 వేల కోట్లు విడుదల చేశామని వెల్లడించారు. రూ. లక్షన్నర రాయితీ ఇవ్వగలిగితే 96 శాతం రైతులు ప్రయోజనం పొందుతారని అన్నారు. కాగా, ప్రభుత్వ ప్రతిపాదనలపై రేపు బ్యాంకర్ల సబ్ కమిటీతో సమావేశమవుతామని సుజనా తెలిపారు. బ్యాంకర్లతో నేడు 5 గంటలపాటు చర్చించామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News