: ఈ 72 ఏళ్ల ఆనందరెడ్డి అసాధ్యుడు!
కడప జిల్లా పులివెందులకు చెందిన ఆనందరెడ్డి వయసు 72. ఆ వయసులో సాధారణంగా అత్యధికులు ఇంటిపట్టున ఉండడానికే ప్రాధాన్యతనిస్తారు. ఎంత ఆరోగ్యవంతులైనా తేలికపాటి వ్యాపకాలతో నెట్టుకొస్తుంటారు. కానీ, ఆనందరెడ్డి ఆ వయసులోనూ బైక్ పై చేసే విన్యాసాలను చూస్తే ఔరా అనిపించకమానదు. హ్యాండిల్ వదిలేసి బైక్ నడపడంలో ఈ మాజీ సైనికుడు దిట్ట. అనంతపురం జిల్లా రాప్తాడు సమీపంలోని మరూరు టోల్ గేట్ వద్ద ఆదివారం ఉదయం 9.25కి బైక్ రైడింగ్ మొదలుపెట్టిన ఆనందరెడ్డి 25 నిమిషాల్లో పెనుకొండ సమీపంలోని గుట్టూరు క్రాసింగ్ చేరుకున్నారు. అంటే, ఆయన 36 కిలోమీటర్లు ప్రయాణించారు... అదీ హ్యాండిల్ పట్టుకోకుండా! ఇక వేగం ఎంతనుకుంటున్నారు... గంటకు 85 కిలోమీటర్లు (ఫిక్స్ డ్ స్పీడ్)! ట్రాఫిక్ లోనూ ఆయన తొణకకుండా బైకును ముందుకు ఉరికించడం విశేషం. దీనిపై ఆనందరెడ్డి మాట్లాడుతూ, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు (25 కిలోమీటర్ల దూరాన్ని 23.54 నిమిషాలలో)ను బ్రేక్ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ విన్యాసం చేపట్టానని తెలిపారు. ఈయన 1963 నుంచి 1970 వరకు ఆర్మీలో పనిచేశారు.