: నేడు తమిళ సీఎంగా పన్నీర్ సెల్వం ప్రమాణం
తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ కొణిజేటి రోశయ్య పన్నీర్ సెల్వంతో ప్రమాణం చేయించనున్నారు. అక్రమాస్తుల కేసులో జయలలిత సీఎం పీఠం నుంచి దిగిపోయిన నేపథ్యంలో ఆమె స్థానంలో పన్నీర్ సెల్వం బాధ్యతలు చేపడుతున్నారు. ఆదివారం బెంగళూరులోని పరప్పణ అగ్రహార కేంద్ర కారాగారంలో ఉన్న జయలలితను కలిసిన పన్నీర్ సెల్వం, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చంచారు. ఈ క్రమంలో తన స్థానంలో తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలన్న జయలలిత ఆదేశాల మేరకు పన్నీర్ సెల్వం, శనివారం మధ్యాహ్నం తర్వాత గవర్నర్ రోశయ్యను కలిశారు. ఇదిలా ఉంటే, కొత్త కేబినెట్ కూర్పుపైనా కూడా జయలలిత, పన్నీర్ సెల్వంకు ఓ జాబితాను అందజేసినట్లు సమాచారం. దీంతో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న ఆయన, కొందరు మంత్రులతో కూడా ప్రమాణ స్వీకారం చేయించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. మరోవైపు జయలలిత కేబినెట్ ను యథాతథంగా కొనసాగించనున్నారని కూడా ప్రచారం సాగుతోంది.