: టీ కొట్టు యజమాని నుంచి సీఎం దాకా.... పన్నీర్ సెల్వం ప్రస్థానం!


తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న ఓ. పన్నీర్ సెల్వం ఓ రకంగా ప్రధాని నరేంద్ర మోడీతో సారూప్యత కలిగి ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ టీ కొట్టులో పనిచేసిన సంగతి తెలిసిందే. తాజాగా పన్నీర్ సెల్వం కూడా టీ కొట్టు నడిపిన కుటుంబం నుంచే వచ్చారు. తండ్రి నడిపిన టీకొట్టును వారసత్వ సంపదగా స్వీకరించిన పన్నీర్ సెల్వం, దివంగత ఎంజీ రామచంద్రన్, జయలలితకు వీరాభిమాని. ఆ వీరాభిమానమే ఆయనను రెండు పర్యాయాలు తమిళనాడు సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. తనకు వీరాభిమానిగా ఉన్న పన్నీర్ సెల్వంను అన్నాడీఎంకే తేని జిల్లా కార్యదర్శిగా నియమించిన జయలలిత 1996లో పెరియకులం మున్సిపల్ ఛైర్మన్ గా ఎన్నికయ్యేలా చేశారు. ఇక 2001లో పెరియకులం ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న పన్నీర్ సెల్వం, జయలలిత మంత్రివర్గంలో కీలకమైన రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నాలుగు నెలల్లోనే కేబినెట్ లో కీలక మంత్రిగా ఎదిగిన పన్నీర్ సెల్వం, జయకు నమ్మినబంటుగా ఎదిగారు. అదే ఏడాది టాన్సీ భూముల కుంభకోణంలో సీఎం పీఠం వదలాల్సి వచ్చిన సందర్భంగా ఆమె, తనకు నమ్మకస్తుడైన పన్నీర్ సెల్వంను ఆ కుర్చీలో కూర్చోబెట్టారు. నాడు పన్నీర్ సెల్వం ఆరు నెలల పాటు సీఎంగా కొనసాగారు. తాజాగా జైలుకెళ్లిన జయలలిత, తాను ఖాళీ చేసిన సీఎం కుర్చీలో రెండో పర్యాయం కూడా పన్నీర్ సెల్వంనే కూర్చోబెట్టారు.

  • Loading...

More Telugu News