: జయకు శిక్ష విధించిన జడ్జి 'మిస్టర్ పర్ఫెక్ట్'
అన్నా డీఎంకే అధినేత్రి జయలలితకు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సంచలనాత్మక తీర్పు వెలువరించిన జడ్జి పేరు జాన్ మైకేల్ డి కున్హా. ముక్కు సూటిగా వ్యవహరిస్తాడని, ఎలాంటి ప్రలోభాలకు లొంగడని ఈయనకు పేరు. మంగళూరుకు చెందిన జాన్ మైకేల్ 1985లో న్యాయవాద వృత్తిలో ప్రవేశించారు. 2002లో జిల్లా న్యాయమూర్తి అయ్యారు. అనంతరం, పలు కీలక బాధ్యతలు చేపట్టారు. హైకోర్టు రిజిస్ట్రార్ గానూ, ప్రధాన న్యాయమూర్తులకు కార్యదర్శిగానూ విధులు నిర్వర్తించారు. 2013లో పరప్పన అగ్రహార న్యాయస్థానం జడ్జిగా నియమితులయ్యారు. తాజాగా, జయ కేసులో విచారణ సందర్భంగా... ఆమె తరపు న్యాయవాదికి కోర్టులోనే ఈయన అక్షింతలు వేశారు. వాస్తవాలను దాచే ప్రయత్నం చేస్తున్నారని, కేసును సాగదీస్తున్నారని మందలించారు. ఒత్తిళ్ళకు లొంగకపోవడం, నిజాయతీ... తదితర అంశాలు జాన్ మైకేల్ ను న్యాయవ్యవస్థలో 'మిస్టర్ పర్ఫెక్ట్' గా నిలబెట్టాయి.