: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ కు మరోమారు ఏపీ సర్కారు ఫిర్యాదు
తెలంగాణ సర్కారుపై మరోమారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టానికి తూట్లు పొడిచేలా కేసీఆర్ సర్కారు వ్యవహరిస్తూ, సీమాంధ్రకు చెందిన ఉద్యోగులను బెదిరింపులకు గురి చేస్తోందని ఆ ఫిర్యాదులో ఆరోపించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత గవర్నర్ కు లేఖ రాశారు. రాష్ట్ర విభజన అనంతరం ఇంకా వేరుపడని 89 సంస్థలపై పెత్తనం చెలాయిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం, వాటిలోని సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులపై బెదిరింపులకు దిగుతోందని ఫిర్యాదు చేశారు. నిన్నటిదాకా మాటలకే పరిమితమైన తెలంగాణ ప్రభుత్వం, తాజాగా సెప్టెంబర్ నెల వేతనాలను ఇవ్వబోమంటూ, తమ ప్రాంత ఉద్యోగులను వేధిస్తోందని మూడు పేజీల ఆ లేఖలో ప్రధాన కార్యదర్శి ఆరోపించారు. పునర్విభజన చట్టం ప్రకారం ఏడాదిలోగా ఆయా సంస్థల విభజనకు అవకాశముందని, గడువున్నప్పటికీ ఆయా సంస్థలపై పట్టు సాధిస్తూ, ఉద్యోగులను వేధిస్తున్నారని వెల్లడించారు. తక్షణమే ఈ విషయంలో కలుగజేసుకుని తెలంగాణ సర్కారు దుందుడుకు చర్యలను నిలువరించాలని ఏపీ సీఎస్ ఆ లేఖలో గవర్నర్ ను కోరారు.