: స్మగ్లర్లతో చేతులు కలిపి, పోలీసులపై అటవీ సిబ్బంది దాడి
స్మగ్లర్లకు, పోలీసులకు మధ్య దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా స్మగ్లింగ్ ను అరికట్టేందుకు పోలీసులు చేసిన దాడి, అటవీ సిబ్బంది వ్యవహార శైలిని వెలుగులోకి తెచ్చింది. అటవీ సిబ్బంది సహాయ సహకారాలతోనే ఎర్రచందన స్మగ్లింగ్ జరుగుతోందన్న వార్తలకు బలం చేకూరే సంఘటన నెల్లూరు జిల్లా అనంతసాగరం అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. అనంతసాగరం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోందన్న సమాచారంతో పోలీసు, అటవీ శాఖల సిబ్బంది వేర్వేరుగా అడవిలోకి వెళ్లారు. పోలీసులు వెళ్లినట్టు అటవీశాఖ సిబ్బందికి తెలియదు, అటవీశాఖ సిబ్బంది వెళ్లినట్టు పోలీసులకు తెలియదు. ఈ నేపథ్యంలో స్మగ్లర్లు పోలీసులకు తారసపడ్డారు. తమను అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులపై స్మగ్లర్లు దాడికి దిగారు. స్మగ్లర్లతో చేతులు కలిపిన అటవీ శాఖ సిబ్బంది కూడా పోలీసులపై ముష్టిఘాతాలు కురిపించారు. దీంతో పోలీసులు హతాశులయ్యారు. స్మగ్లర్లతో చేతులు కలిపిన అటవీశాఖ కురిపించిన దెబ్బలకు ఓ కానిస్టేబుల్ గాయపడ్డాడు.