: మా లక్ష్యం ఇది...తేడా మీరే చూస్తారు: మోడీ


80 కోట్ల మంది యువకులతో నవయువ భారత్ ఆశావాదంతో, ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడుతోందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. వాల్ స్ట్రీట్ జర్నల్ కు రాసిన వ్యాసంలో ఆయన పలు అంశాలపై భారత్ దృక్పథాన్ని స్పష్టం చేశారు. యువజనుల శక్తి, ఉత్సాహం, వ్యాపార దక్షత భారత్ కు ఉన్న అతి పెద్దబలమని ఆయన పేర్కొన్నారు. ఈ లక్షణాలను వెలికి తీయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అనవసర చట్టాలను తొలగించడం, నియంత్రించడం ద్వారా పారదర్శకత పెంచి తాము అనుకున్న లక్ష్యాలు సాధిస్తామని ప్రధాని తెలిపారు. నైపుణ్యాలతో కూడిన విద్య, భద్రత, గౌరవప్రద జీవితం, సమాజంలో ప్రతి వర్గానికి, ముఖ్యంగా మహిళలకు హక్కులని, ఆ హక్కులు అందించడానికి చేయాల్సిందల్లా చేస్తామని మోడీ చెప్పారు. ప్రతి భారతీయుడికి బ్యాంకు ఖాతా, ప్రతి ఒక్కరూ భరించగలిగేలా వైద్య సదుపాయాలు, పరిశుభ్రమైన పరిసరాలు, అందరికీ ఇల్లు, ప్రతి ఇంటికీ విద్యుత్ సౌకర్యం, ప్రతి గ్రామానికి రోడ్లు వంటివన్నీ సమకూర్చడమే తమ ప్రధాన కర్తవ్యమని ఆయన వివరించారు. ఇవన్నీ సాధించడానికి సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నో అవకాశాలు ఉన్నాయని తాను నమ్ముతున్నానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సెల్ ఫోన్ వాడకంలో పదేళ్లలో 4 కోట్ల నుంచి 90 కోట్లకు చేరిందని, స్మార్ట్ ఫోన్ వాడకంలో భారత్ రెండో స్థానంలో ఉందని, తమకు సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవడం వెన్నతో పెట్టిన విద్య అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచంతో స్నేహపూర్వకంగా మసులుకోవడం భారత్ గొప్పదనమని తెలిపిన ఆయన, వ్యాపార, పరిశోధన, సృజనాత్మక, పర్యాటక రంగాల్లో స్నేహంగా ఉంటామని స్పష్టం చేశారు. భారత్ ను కొత్త అంతర్జాతీయ తయారీ కేంద్రంగా తయారు చేస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్ లో నగరాలను, పట్టణాలను నివాసయోగ్యంగా, స్మార్ట్ సిటీలుగా మారుస్తామని ఆయన అన్నారు. గ్రామాలను ఆర్థిక రూపాంతరతకు కొత్త మార్గాలుగా తయారు చేస్తామని ఆయన వాల్ స్ట్రీట్ వ్యాసంలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News