: హైదరాబాదులో మరో ఎయిర్ పోర్టు: జీఎంఆర్
హైదరాబాదుకు ఉత్తరాన మరో ఎయిర్ పోర్టును ఏర్పాటు చేస్తామని జీఎంఆర్ సంస్థ తెలిపింది. హైదరాబాదులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎయిర్ పోర్టు సిటీ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, 750 కోట్ల రూపాయలతో హైదరాబాదులో ఏర్పాటు చేయబోయే ఎయిర్ పోర్టు సిటీ ప్రాజెక్టు ద్వారా 15 నుంచి 20 వేల మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు. ఎయిర్ పోర్టు సిటీ వద్ద ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్, ధీమ్ పార్క్, నేచర్ క్యూర్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పది శాతం తక్కువగా ఉన్న పన్నుల విధానం ప్రవేశపెడతామని వారు చెప్పారు. విమానాశ్రయం వద్ద ఆధునిక వసతులతో ఆసుపత్రి ఏర్పాటు చేయనున్నామని వారు వివరించారు. వారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విన్న కేసీఆర్, ప్రతిపాదనలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.