: రౌడీ షీటర్ అనుకుని సినీ అసిస్టెంట్ కెమెరామన్ ను నరికారు
హైదరాబాదులో హత్యల సంస్కృతి పెరిగిపోతోంది. ప్రత్యర్ధులను మట్టుబెట్టేందుకు కత్తులు, కటార్లతో బయల్దేరుతున్నారు. ఈ నేపథ్యంలో తమ ప్రత్యర్ధి అనుకుని పొరబడి సినీ అసిస్టెంట్ కెమెరామన్ ను కత్తులతో నరికిన భయానక సంఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. జూబ్లిహిల్స్ చెక్ పోస్టుకు దగ్గర్లో ఉండే కృష్ణానగర్ లోని 'బి'బ్లాక్ లో సినీ అసిస్టెంట్ కెమెరామన్ గోపి తన స్నేహితులతో మాట్లాడుతుండగా, రహమత్ నగర్ కు చెందిన చోర్ చేత, చోర్ అబ్బు, శీను తమ అనుచరులు 30 మందితో వచ్చి తల్వార్లతో దాడి చేసి పరారయ్యారు. గోపి తీవ్రంగా గాయపడడంతో అతని స్నేహితులు అపోలో ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో స్థానిక రౌడీ షీటర్ అర్జున్ యాదవ్ ను హత్య చేసేందుకు వచ్చిన దుండగులు, గోపీని అర్జున్ యాదవ్ గా భ్రమపడి కత్తులతో దాడి చేశారని తేలింది. దీంతో, నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.