: ఐదేళ్లలో హర్యానా అసెంబ్లీ సమావేశమైంది 56 రోజులే!
హర్యానా దేశ రాజధాని ఢిల్లీకి ఆనుకుని ఉండే ఈ రాష్ట్రం. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు కీలకమైనదే. పదేళ్లుగా కాంగ్రెస్ నేత భూపీందర్ సింగ్ హుడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వచ్చే నెల 15న జరగనున్న ఎన్నికలు ఆయన భవితవ్యాన్ని తేల్చనున్నాయి. తాజా ఎన్నికల్లో విజయభేరీ మోగించి హ్యాట్రిక్ సాధించి తీరతానని కూడా ఆయన చెబుతున్నారు. అధికారం మాట అంటుంచితే, ఆయన పాలనలో శాసనసభ సమావేశాలు ప్రహసనంగా సాగాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా వెలుగు చూసిన విషయమేమిటంటే, ఐదేళ్ల కాలంలో హుడా ప్రభుత్వం అసెంబ్లీని 56 రోజుల పాటే నిర్వహించింది. అదేంటీ, ఏటా జరిగే బడ్జెట్ సమావేశాలే దాదాపు 15 రోజుల దాకా సాగుతాయి కదా అంటే, అదేమీ లేదులెండి, మేం నాలుగైదు రోజుల్లోనే బడ్జెట్ సమావేశాలను ముగించామని చెప్పి అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తోంది. ఏడాదికి పదకొండు రోజుల పాటే శాసన సభను నిర్వహించిన హుడా సర్కారు చరిత్ర సృష్టించింది. మరి మూడోసారి అధికారం కట్టబెడితే, ఆయన పనితీరు ఇంకెంత ఘనంగా ఉంటుందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.