: ఒడిశా మాజీ పోలీసు బాసుపై అవినీతి కేసు!


ఒడిశా మాజీ డీజీపీ ప్రకాశ్ మిశ్రాపై అవినీతి ఆరోపణల కింద కేసు నమోదైంది. ప్రస్తుతం కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రకాశ్ మిశ్రా, 2012లో ఒడిశా డీజీపీగా పనిచేశారు. 2006-09 మధ్య కాలంలో ఒడిశా రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించిన సమయంలో మిశ్రా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్టు ఆ రాష్ట్ర విజిలెన్స్ డైరెక్టర్ కేబీ సింగ్ చెప్పారు. ఈ ఆరోపణల కింద మిశ్రాపై కేసు నమోదు చేశామని కూడా సింగ్ వెల్లడించారు. పోలీస్ హౌసింగ్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించిన మిశ్రా, సిమెంట్, స్టీల్ సరఫరా చేసే కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్ధంగా అడ్వాన్సులు మంజూరు చేశారు. అయితే తీసుకున్న అడ్వాన్సుల మేరకు వారంలోగా సిమెంట్, స్టీలు సరఫరా చేయాల్సిన కాంట్రాక్టర్లు, అందులో విఫలమయ్యారు. అయినా, వారిపై చర్యలు తీసుకోని మిశ్రా మరోమారు అడ్వాన్సులను అందజేశారు. దీనిపై ఆడిట్ నివేదికలు తప్పుబట్టిన నేపథ్యంలో విచారణ జరపగా మిశ్రా అక్రమాలకు పాల్పడ్డారని తేలిందని సింగ్ వెల్లడించారు. అయితే తనపై విజిలెన్స్ కేసు నమోదైన విషయం తెలియదని మిశ్రా చెప్పారు. ఇదిలా ఉంటే, గతేడాది సీబీఐ స్పెషల్ డైరెక్టర్ పదవికి కోసం తయారైన ఎంపిక చేసిన ఐపీఎస్ అధికారుల జాబితాలో మిశ్రా పేరు కూడా చోటుచేసుకోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News