: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం ఇదే
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరంగా లండన్ అవతరించింది. బ్రిటన్ రాజధాని అయిన ఈ నగరం ఈ విషయంలో హాంకాంగ్ ను వెనక్కి నెట్టింది. హాంకాంగ్ ఇప్పటివరకు ఖరీదైన నగరంగా ఉంది. ఇక, లండన్ లో జీవనం ఎంత ఖర్చుతో కూడుకున్నదంటే... ఆ వ్యయం సిడ్నీతో పోల్చితే రెండు రెట్లు, రియో డి జనీరోతో పోల్చితే నాలుగు రెట్లు ఎక్కువట. మన ముంబయి ఈ జాబితాలో చివరన ఉంది. ముంబయిలో ఓ ఉద్యోగికి ఏడాదికి అయ్యే ఖర్చు రూ.18,13,000 కాగా, లండన్ లో ఓ ఉద్యోగికి సాలీనా రూ.73 లక్షలు ఖర్చవుతుందట. ఆఫీసు అద్దెలు, డాలర్ తో పోల్చితే పౌండ్ విలువ తదితర అంశాలు లండన్ లో జీవనవ్యయం పెంపునకు కారణమయ్యాయని ఈ మేరకు అధ్యయనం చేపట్టిన 'సవిల్స్' సంస్థ తెలిపింది. ఈ రియల్ ఎస్టేట్ సంస్థ విడుదల చేసిన 12 ఖరీదైన నగరాల జాబితాలో... లండన్ తర్వాత హాంకాంగ్, న్యూయార్క్, పారిస్, టోక్యో, సింగపూర్, మాస్కో, సిడ్నీ, దుబాయ్, షాంఘై, రియో డి జనీరో, ముంబయి ఉన్నాయి.