: పుజారా ఇలా చేశాడేంటబ్బా...!
ఛటేశ్వర్ పుజారా... భారత క్రికెట్ ఆశాకిరణం. 2013లో ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు గ్రహీత కూడా. అలాంటి ఆటగాడు రూల్సు మర్చిపోయి పిల్లాడిలా ప్రవర్తించడం ఆశ్చర్యం కలిగించకమానదు. ప్రస్తుతం కౌంటీల్లో ఆడుతున్న ఈ సౌరాష్ట్ర యువకెరటం డెర్బీ షైర్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. లీసెస్టర్ షైర్ తో మ్యాచ్ సందర్భంగా వికెట్ల దిశగా వెళుతున్న బంతిని చేతితో అడ్డగించి 'హ్యాండిల్డ్ ద బాల్' రూపంలో అవుటయ్యాడు. 21 బంతులెదుర్కొన్న పుజారా కేవలం 6 పరుగులే చేసి అనూహ్యరీతిలో వెనుదిరిగాడు. 1996 తర్వాత ఇలా చేతితో బంతిని నిలువరించే ప్రయత్నం చేసి అవుటైన తొలి ఆటగాడు పుజారానే. అదే ఏడాది భారత్ తో డెర్బీషైర్ మ్యాచ్ సందర్భంగా, కార్ల్ క్రిక్కెన్ సరిగ్గా ఇలానే అవుటయ్యాడు. అప్పుడు క్రిక్కెన్... ఇప్పుడు పుజారా... ఇద్దరూ ఒకే మైదానంలో ఇలా అవుట్ కావడం వైచిత్రి. ఇప్పటివరకు ప్రపంచ క్రికెట్ చరిత్రలో 'హ్యాండిల్డ్ ద బాల్' కారణంగా ఏడుగురు మాత్రమే అవుటయ్యారు.