: ఇస్రోను అభినందించిన మోడీ.. మంగళ్ కు తల్లి (మామ్) లభించిందని చమత్కారం


మామ్ ప్రయోగం విజయవంతం అయ్యాక ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందిస్తూ ప్రసంగించారు. మంగళ్ కు తల్లి (మామ్) లభించిందని మోడీ ఈ సందర్భంగా చమత్కరించారు. ఉపగ్రహానికి 'మామ్' అని పేరు పెట్టినప్పుడే ఈ ప్రయోగం విజయవంతమవుతుందని భావించానని ఆయన అన్నారు. అమ్మలాగా 'మామ్' కూడా భారత్ ను విజయతీరాలకు చేర్చిందని ఆయన అన్నారు. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించిందన్నారు. అసాధ్యాలను సుసాధ్యం చేయడం ఇస్రో శాస్త్రవేత్తలకు అలవాటుగా మారిందని మోడీ వారిని అభినందించారు. జాతి నిర్మాణంలో ఇస్రో విజయాలు కీలకంగా నిలిచాయని మోడీ ప్రశంసించారు. ఇస్రో శాస్త్రవేత్తలు సాధించిన ఈ విజయం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని మోడీ అన్నారు. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'గ్రావిటీ' సినిమా కంటే తక్కువ బడ్జెట్ తో ఇస్రో ఈ ప్రయోగాన్ని నిర్వహించిందని మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ మళ్లీ జగద్గురువుగా నిలుస్తుందని స్వామి వివేకానంద ప్రకటించారని... ఆ జగద్గురువు స్థాయిని మళ్లీ అందుకోవడానికి ఈ విజయం తొలి మెట్టు అని మోడీ అన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు తమ పనితీరుతో దేశానికి గర్వకారణంగా నిలిచారని మోడీ అన్నారు. దేశంలోని ప్రతి పాఠశాలలో 5 నిమిషాల పాటు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించాలని మోడీ అన్నారు.

  • Loading...

More Telugu News