: హైదరాబాద్ 'బంగారు బాతు' అని చెప్పాం... మా మాట వినలేదు: పొన్నాల
హైదరాబాదు నగరం బంగారు గుడ్లు పెట్టే బాతు అని తాము మొదటి నుంచీ చెబుతున్నామని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తాము పరిపాలనానుభవంతో ఇంతకుముందు చెప్పిన విషయాలనే, 14వ ఆర్థిక సంఘానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని అన్నారు. తాము హైదరాబాదు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నామని, తెలంగాణలో అధిక ఆదాయం వచ్చే ఏకైక సిటీ హైదరాబాదు అనీ, ఇక్కడికి పెట్టుబడులు రాకపోతే చాలా ప్రమాదమని హెచ్చరించామని కూడా ఆయన చెప్పారు. అయినా, తెలంగాణ సర్కారు తమ మాట లక్ష్యపెట్టకుండా పలు అసమంజసమైన నిర్ణయాలు తీసుకుందని అన్నారు. హైదరాబాదులోని ప్రజల్లో భద్రత పెంచి, నగర ప్రతిష్ఠను పెంచితే తెలంగాణ లక్ష్యాలు నెరవేరుతాయని, లేని పక్షంలో పెట్టుబడులు తరలిపోయి, భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆయన హెచ్చరించారు. అధికారం ఉందికదా అని అపరిపక్వ నిర్ణయాలు తీసుకోకూడదని ఆయన హితవు పలికారు.