: మంత్రిగారి కుక్క మిస్సింగ్... కదిలిన పోలీసు గణం


జైపూర్ లోని వైశాలి నగర్ లో జరిగిన దోపిడీ, అత్యాచారం ఘటనతో ఉలిక్కిపడిన పోలీసులకు మంత్రిగారి కుక్క తప్పిపోయిందన్న ఫిర్యాదు మరింత తలనొప్పిగా మారింది. రాజస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి రాజేంద్ర రాథోడ్ కు చెందిన 'చార్లీ' అనే లాబ్రడార్ జాతి కుక్కపిల్ల శనివారం రాత్రి నుంచి కనిపించడం లేదట. దీంతో, ఆ శునకానికి సంరక్షకుడిగా వ్యవహరిస్తున్న వ్యక్తి సోడాలా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఇంకేముంది, పోలీసు అధికారుల్లో చురుకుపుట్టింది. పై అధికారులు తమ కింది వారికి ఆదేశాలు జారీ చేశారు... ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కుక్క ఆచూకీ కనిపెట్టాలంటూ. మంత్రి గారి పెంపుడు కుక్క కదా మరి. ఆదివారం మొత్తం పోలీసు బృందాలు ఇదే పనిలో మునిగిపోయాయట. దీనిపై ఓ కరపత్రాన్ని కూడా ముద్రించారు. కుక్క ఆచూకీ చెబితే రూ.10,000 రివార్డు అంటూ... ఈ వేటలో ప్రజలనూ భాగస్వాములను చేసే ప్రయత్నం తలపెట్టారు. అయితే, దీనిపై కాంగ్రెస్ నేత అర్చనా శర్మ మాట్లాడుతూ, వైశాలి నగర్ లో ఓ కుటుంబం దారుణ హింసకు గురైతే పట్టించుకోకుండా, పోలీసులు మంత్రిగారి కుక్క కోసం వెదుకుతుండడం అన్యాయమని విమర్శించారు. పోలీస్ కమిషనర్ శ్రీనివాసరావు వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News