: నేడు మంగళ్ యాన్ యాత్రలో కీలక దశ!


అంగారక గ్రహ పరిశోధనకు భారత్ చేపట్టిన మంగళ్ యాన్ యాత్ర నేడు కీలక దశను దాటబోతోంది. ఈ నెల 24న అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశించనున్న మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్)కు ఇస్రో శాస్త్రవేత్తలు కీలక పరీక్ష చేయబోతున్నారు. అంగారక గ్రహ ప్రభావిత ప్రాంతంలోకి ప్రవేశించనున్న మామ్ లోని కీలక ఇంజిన్ ను పనిచేయించనున్నారు. తద్వారా మామ్ మార్గ సవరణ దిశను దిగ్విజయంగా మార్చనున్నారు. ఈ ఇంజిన్ పనిచేయడం మొదలుపెడితే, ప్రతికూల పరిస్థితులను దాటుకుంటూ రెండు రోజుల పాటు ప్రయాణించే మామ్ బుధవారం అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. ఇప్పటికే మూడు పథ సవరణ విన్యాసాలను దిగ్విజయంగా పూర్తి చేసిన ఇస్రో, నేడు నాలుగో పథ సవరణ విన్యాసానికి సర్వం సిద్ధం చేసింది. "సోమవారం చేపట్టనున్న నాలుగో పథ సవరణ విన్యాసం పూర్తయితే, బుధవారం మామ్ అంగారక కక్ష్యలోకి దాదాపుగా ప్రవేశించినట్లే. అనుకోని పరిస్థితుల్లో నాలుగో పథ సవరణ విన్యాసం విఫలమైనా, ఎలాంటి ఇబ్బంది లేకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నాం" అని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు.

  • Loading...

More Telugu News