: విజయవాడ మెట్రో రైల్ పూర్తి వివరాలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలో మెట్రో రైల్ నిర్మాణంపై ఢిల్లీ మెట్రో రూపకర్త శ్రీధరన్ నేతృత్వంలో నిపుణుల కమిటీ ప్రాధమిక పరిశీలన పూర్తి చేసింది. అనంతరం శ్రీధరన్ మాట్లాడుతూ, విజయవాడ, మంగళగిరిని కలుపుకుని 30 కిలోమీటర్ల పొడవైన మెట్రోరైలు మార్గాన్ని నిర్మించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి కిలోమీటర్ కు ఒక రైల్వే స్టేషన్ ఉంటుందని ఆయన తెలిపారు. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపడతామని అన్నారు. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, మున్సిపల్ అధికారులతో విస్తృతంగా చర్చించామని అన్నారు. మెట్రో నిర్మాణం చాలా ఖర్చుతో కూడుకున్నదని, స్టేషన్ల నిర్మాణానికి భూమి అవసరం ఉంటుందని ఆయన తెలిపారు. ప్రతిపాదిత మార్గాల్లో జనాభా, ట్రాఫిక్ ను అంచనా వేశామని ఆయన వెల్లడించారు. జనవరి చివరినాటికి ప్రాజెక్టును రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సమర్పిస్తామని ఆయన తెలిపారు. గుంటూరు వంటి ప్రాంతాలకు మెట్రో విస్తరించడం ఆర్థికంగా పెనుభారంగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు. అవసరమనుకుంటే రెండో విడత మెట్రోరైల్ నిర్మాణంలో గుంటూరు వరకు విస్తరించవచ్చని ఆయన వివరించారు. మెట్రో ప్రాజెక్టులు ఎక్కడైనా లాభదాయకమైన ప్రాజెక్టులు కావని ఆయన తెలిపారు. సేవాభావంతోనే మెట్రోలు పనిచేస్తాయని ఆయన అన్నారు. ఆరు నెలల వ్యవధిలో విజయవాడ మెట్రో టెండర్లు పూర్తవుతాయని ఆయన చెప్పారు.