: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సోనియా, రాహుల్
పడితే కాని తెలిసి రాలేదు కాంగ్రెస్ పార్టీకి. దేశంలోని ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంటే, ఆ పార్టీ అగ్రనేతలకు కంటికే ఆనలేదు. తాము కేవలం పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి మాత్రమే పరిమితమంటూ డాంబికాలు ప్రదర్శిస్తూ వచ్చారు. ఆ పార్టీ స్థానిక నేతలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. కాని నిన్నటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు, పార్టీ కేడర్ కే కాదు అగ్ర నేతలకూ కళ్లు తెరిపించాయి. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లకపోతే, మున్ముందు పార్లమెంట్ లో డబుల్ డిజిట్ సీట్లు కూడా సాధ్యం కాదని వారికి అర్థమయ్యేలా చేశాయి. నిన్నటిదాకా పార్టీలో కొనసాగుతూ వస్తున్న సంప్రదాయాన్ని పక్కన బెట్టేసిన ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో పాటు యువరాజు రాహుల్ గాంధీ కూడా హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచార బరిలోకి దూకేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం విడుదలైన పార్టీ ప్రచార సారథుల జాబితాలో సోనియా, రాహుల్ ల పేర్లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. శనివారం నుంచి నామినేషన్ల ఘట్టం ప్రారంభం కానున్న హర్యానా అసెంబ్లీ బరికి కాంగ్రెస్, ఇంకా అభ్యర్థులను కూడా ఖరారు చేయకపోవడం గమనార్హం.