: యువీ కెరీర్లో మరపురాని రోజిది!


సరిగ్గా ఏడేళ్ళ క్రితం భారత జట్టు ధోనీ సారథ్యంలో టి20 వరల్డ్ కప్ నెగ్గింది. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ఆ టోర్నీలో కుర్రాళ్ళతో పాల్గొన్న టీమిండియాపై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. ప్రతి మ్యాచ్ లోనూ ఎవరో ఒకరు జట్టు బాధ్యతలను స్వీకరించి, రాణించడంతో టైటిల్ భారత్ వశమైంది. మొత్తమ్మీద ఆ విజయం సమష్టి కృషికి నిదర్శనం. ఇక, ఆ టోర్నీ డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కు మరుపురానిది. సరిగ్గా ఇదే రోజున అంటే సెప్టెంబర్ 19న భారత జట్టు ఇంగ్లండ్ తో లీగ్ మ్యాచ్ ఆడింది. ఆ పోరులో శివాలెత్తిపోయిన యువీ ఇంగ్లండ్ పేసర్ స్టూవర్ట్ బ్రాడ్ కు పీడకలలు మిగిల్చాడు. బ్రాడ్ విసిరిన ఓవర్లో, మొత్తం ఆరు బంతులనూ సిక్సర్లుగా మలిచాడు. బ్రాడ్ బంతిని ఎక్కడ విసిరినా, యువీ దాన్ని స్టాండ్స్ లోకి పంపి తన టెక్నిక్ ఎంత పటిష్టమైనదో చాటాడు. యువీ కేవలం 16 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్సులతో 58 పరుగులు సాధించగా, భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 218 పరుగులు చేసింది. ఈ పంజాబీ యోధుడు క్రీజులోకి వచ్చే సమయానికి స్కోరు 17 ఓవర్లలో 3 వికెట్లకు 155 పరుగులే. అక్కడి నుంచి యువీ సాగించిన విధ్వంసకాండ ఇంగ్లండ్ బౌలర్లకు కడగండ్లు మిగిల్చింది. ముఖ్యంగా బ్రాడ్ కు. యువీ చెలరేగిపోతుంటే చేసేదేమీలేదన్నట్టుగా బంతులు విసిరి తగిన మూల్యం చెల్లించుకున్నాడు. ఆ మ్యాచ్ లో భారత్ నెగ్గింది. ఇంగ్లండ్ కూడా గట్టిపోటీ ఇచ్చినా 200 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది.

  • Loading...

More Telugu News