: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భార్యతో ఓ 'సినీ హీరో' గొడవ
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఓ వర్థమాన సినీ హీరో భార్యతో గొడవపడిన సంఘటన సంచలనం సృష్టించింది. ఎయిర్ పోర్ట్ అధికారుల కథనం ప్రకారం, 'కుర్కురే' సినిమా హీరో ఇంద్రసేన వేరే నగరం నుంచి విమానంలో ఈరోజు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాడు. ఆయనను రిసీవ్ చేసుకోవడానికి అతని భార్య విమానాశ్రయానికి వచ్చింది. అయితే, హఠాత్తుగా ఎయిర్ పోర్ట్ లో కలుసుకున్న వెంటనే ఇంద్రసేన, అతని భార్య గొడపపడటం ప్రారంభించారు. గట్టిగా అరుచుకుంటూ ఒకరినొకరు తిట్టుకోవడం మొదలుపెట్టారు. ఇదంతా గమనిస్తున్న ఎయిర్ పోర్ట్ లో ఒక వ్యక్తి... పోలీసులకి ఫోన్ చేసి ఓ మహిళను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపాడు. వెంటనే, పోలీసులు హుటాహుటిన శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని ఇంద్రసేన దంపతులను విచారించారు. తామిద్దరం భార్యాభర్తలమని... ఓ విషయంలో కేవలం గొడవపడుతున్నామని వారిద్దరూ ఒకే మాట చెప్పడంతో... ఆఖరికి నివ్వెరబోవడం పోలీసుల వంతయ్యింది. కిడ్నాప్ కాల్ రావడంతో హడావుడిగా ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న పోలీసులు ఆ తర్వాత అసహనంతో ఎయిర్ పోర్ట్ ను వీడారు.