: ప్రభుత్వ క్వార్టర్ ఖాళీ చేయమన్నందుకు 'రచ్చరచ్చ' చేస్తోన్న మాజీ మంత్రి అజిత్ సింగ్
కొత్తగా ఎన్నికైన ఎంపీలకు నివాసాలు కేటాయించేందుకు వీలుగా మాజీ ఎంపీలు తమ ప్రభుత్వ క్వార్టర్లను ఖాళీ చేయాలని ఎన్డీయే ప్రభుత్వం గత మూడు నెలలుగా మొత్తుకుంటోంది. అయినా, మాజీ ఎంపీల నుంచి ఏమాత్రం ఉలుకు పలుకు లేకపోవడంతో ఈనెల 10న దాదాపు 120 మంది మాజీ ఎంపీల క్వార్టర్లకు కరెంట్, నీళ్ల సరఫరాను నిలిపివేసింది. వీళ్లలో రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షడు అజిత్ సింగ్ కూడా ఒకరు. తన లాంటి సీనియర్ రాజకీయనాయకుడితో ఈ విధంగా ప్రవర్తించి అవమానిస్తారా? అని అజిత్ సింగ్ ప్రభుత్వంపై గత కొన్ని రోజులుగా ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. ఆయనకు వచ్చిన కోపానికి ఫలితంగా ఈరోజు ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ నగరంలో రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ కార్యకర్తలు 'రచ్చ రచ్చ' చేశారు. తమ నేతను అవమానించారంటూ ఆందోళనకు దిగారు. పోలీసులపై రాళ్లు విసరడంతో పాటు, హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. ఈ ఆందోళనలో ఇరవై మందికి తీవ్రగాయాలయ్యాయి. తమ నేత క్వార్టర్ కు కరెంట్, వాటర్ సరఫరాను పునరుద్ధరించకపోతే... ఢిల్లీకి నీళ్లు సరఫరా చేసే పైప్ ను బ్లాక్ చేస్తామని వారు హెచ్చరించారు. అజిత్ సింగ్ కు పలువురు కాంగ్రెస్ నేతలు కూడా ఈ విషయంలో మద్దతు పలికారు. అజిత్ సింగ్ లాంటి సీనియర్ నేతకు కరెంట్, వాటర్ సరఫరాను బంద్ చేయడం ద్వారా ఎన్టీయే సర్కార్ చాలా అమర్యాదకరంగా ప్రవర్తించిందని హర్యానా ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడా వ్యాఖ్యానించారు.