: సరిహద్దు వివాదాన్ని జిన్ పింగ్ వద్ద గట్టిగా ప్రస్తావించిన మోడీ
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ఈరోజు జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇండో- చైనా సరిహద్దు వివాదాన్ని గట్టిగా ప్రస్తావించారు. ఇండో- చైనా సంబంధాలు భవిష్యత్తులో శాంతియుతంగా... స్థిరంగా కొనసాగాలంటే సరిహద్దు రేఖ వివాదాన్ని వెంటనే చర్చించుకోవాలని జిన్ పింగ్ పై మోడీ ఒత్తిడి తెచ్చారు. సరిహద్దు వివాదాలు సమసిపోయినప్పుడే... భారత్, చైనాల మధ్య శాశ్వతమైన శాంతి సామరస్యాలు నెలకొంటాయని మోడీ చైనా అధ్యక్షుడికి తెలియజేశారు. స్పష్టమైన సరిహద్దు రేఖ లేకపోవడమే భారత్-చైనాల మధ్య సరిహద్దు వివాదాలకు కారణమని జిన్ పింగ్ భారత ప్రధానికి సమాధానమిచ్చారు. అయితే, వెంటనే ఇండో- చైనా సరిహద్దు రేఖ గురించి చర్చించుకుని స్పష్టత తెచ్చుకుందామని మోడీ ప్రతి సమాధానమిచ్చారు. మోడీ ప్రతిపాదనకు జిన్ పింగ్ అంగీకారం తెలిపారు. వీలైనంత త్వరగా సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన కూడా అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ హౌస్ లో జరిగిన మీడియా మీట్ లో ఇరు నేతలు ఇదే రకమైన అభిప్రాయాన్ని మరోసారి వ్యక్తం చేశారు.