: కానిస్టేబుల్ కుమార్తెను కదులుతున్న కారులో పాడు చేశారు
చట్టాలు తెచ్చినా, శిక్షలు విధిస్తున్నా మృగాళ్లలో మార్పులు రావడం లేదు. మహిళ ఒంటరిగా బయటకు వెళ్తే చాలు, కాచుక్కూర్చున్న కాలనాగుల్లా కామాంధులు కాటేస్తున్నారు. దేశ రాజధానిలో ఇలాంటి దారుణమే చోటు చేసుకుంది. కానిస్టేబుల్ కుమార్తెను ఆమె స్నేహితుడు అతని మిత్రులు కలిసి సామూహిక అత్యాచారం చేశారు. ఢిల్లీలోని నెహ్రూప్లేస్ ఏరియాలో మహిళా కానిస్టేబుల్ కుమార్తెను ఆమె స్నేహితుడు కారులో తీసుకెళ్తూ మత్తు పదార్థాలు కలిపిన కూల్ డ్రింక్ తాగించాడు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిన తరువాత అతను, అతని ఇద్దరు స్నేహితులు ఆమెపై అత్యాచారానికి తెగబడ్డారు. అనంతరం ఆమెను నెహ్రూప్లేస్ లోని ఓ ఫ్లై ఓవర్ వద్ద వదిలేసి పోయారు. అపస్మారక స్థితిలో ఉన్న యువతిని ఆటోడ్రైవర్ గమనించి, పోలీసులకు సమాచారమందించగా, పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆమె సామూహిక అత్యాచారానికి బలైనట్టు వైద్య పరీక్షల్లో తేలిందని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.