: మా రాష్ట్రం విడిపోదు... ఆయన వేర్పాటు వాది: కర్ణాటక ముఖ్యమంత్రి
కర్ణాటక రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. గుల్బర్గాలో హై-క విమోచన దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాజీ మంత్రి ఉమేష్ కత్తి అధికారంలో ఉండగా విభజనపై నోరెందుకు ఎత్తలేదని ప్రశ్నించారు. కలసిమెలసి ఉంటున్న కన్నడిగుల మధ్య విభజన చిచ్చు రాజేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రెచ్చగొట్టే మాటలతో ప్రజల మధ్య భావోద్వేగాలు రేపవద్దని ఆయన సూచించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. హై-క అభివృద్ధికి బోర్డు ఏర్పాటు చేసి 600 కోట్ల రూపాయలను కేటాయించామన్నారు. అందులో భాగంగా ఇప్పుడు 150 కోట్లు విడుదల చేస్తున్నామని ఆయన తెలిపారు. రాయచూరులో ఐఐటీ, ఎయిమ్స్ వంటి సంస్థల ఏర్పాటుకు కేంద్రానికి నివేదిక ఇస్తామని ఆయన వెల్లడించారు.