: మీకు 'లవ్ జిహాద్' గురించి నిజంగా తెలియదా?... రాజ్ నాథ్ కు డిగ్గీ లేఖ
ఉత్తరాదిన కలకలం రేపుతున్న 'లవ్ జిహాద్' అంటే ఏమిటో తనకు తెలియదంటూ అమాయకంగా చెప్పిన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ లేఖ ద్వారా ప్రశ్నించారు. "లవ్ జిహాద్ గురించి మీకు ఎందుకు తెలియదు?" అని అడిగారు. "మీ సొంతం రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో బీజేపీ, వీహెచ్ పీ, ఆర్ఎస్ఎస్ నేతలు విరివిగా మాట్లాడుతున్న లవ్ జిహాద్ గురించి మీకు తెలియదంటే నమ్మలేను" అని అన్నారు. ఇటీవల ఆర్ఎస్ఎస్ పత్రికలు పాంచజన్య, ఆర్గనైజర్ లు లవ్ జిహాద్ గురించి కవర్ స్టోరీలు రాశాయని, బహుశా రాజ్ నాథ్ వాటిని చదువుతున్నట్టు లేరని అన్నారు. అంతేగాక, ఈ పదం వాడిన బీజేపీ నేత యోగి ఆదిత్యానాథ్ కు ఎన్నికల సంఘం ఆక్షేపణలను కూడా జారీ చేసిన విషయం తెలియదేమోనంటూ ఎద్దేవా చేశారు డిగ్గీ. లవ్ జిహాద్ గురించి తెలియదన్న హోంమంత్రి మాటలకు తాను ఎంతో ఆశ్చర్యపోయానని అనంతరం మీడియాతో దిగ్విజయ్ అన్నారు.