: ఏపీ సర్కారు 'ఇ-క్యాబినెట్' భేటీ డీటెయిల్స్
సీఎం చంద్రబాబు నాయుడు నేడు నిర్వహించిన ఇ-క్యాబినెట్ భేటీ వివరాలను రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథరెడ్డి మీడియాకు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఇ-క్యాబినెట్ సమావేశం జరిపిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందన్నారు. ప్రభుత్వ పథకాల అమలు తీరుపై పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. గ్రామ, మండల, మున్సిపల్, జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీలు ఉంటాయని చెప్పారు. అనంతపురం జిల్లా ఎన్బీ కుంట ప్రాంతంలో ఎన్టీపీసీ వెయ్యి మెగావాట్ల సోలార్ ఎనర్జీ ప్లాంట్ కు 5,500 ఎకరాలు కేటాయించామని తెలిపారు. కర్నూలు జిల్లా పాణ్యంలో ఎన్వీవీఎన్ఎల్ సంస్థ నిర్మించే సోలార్ ఎనర్జీ ప్లాంట్ కు 5 వేల ఎకరాలు కేటాయించామని పేర్కొన్నారు. ఇదే సంస్థకు కడప జిల్లా గాలివీడులో సోలార్ ఎనర్జీ ప్లాంట్ కు 3 వేల ఎకరాల భూమి కేటాయించామన్నారు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో సోలార్ ఎనర్జీ పార్కుల నిర్మాణం చేపడతామని అన్నారు. రాష్ట్రంలో 132 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉందని తెలిపారు. ఆన్ లైన్ మార్కెటింగ్ ద్వారా విద్యుత్ లోటు భర్తీకి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంలో భారత ప్రభుత్వం 50 శాతం, జెన్ కో 40 శాతం, నెడ్ క్యాప్ 9 శాతం భాగస్వామ్యం తీసుకుంటాయని మంత్రి వివరించారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి సమక్షంలో రేపు ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంటామని చెప్పారు. ఇక, మావోయిస్టులపై మరో ఏడాది పాటు నిషేధం పొడిగించాలని కూడా క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నామని పల్లె రఘునాథరెడ్డి వెల్లడించారు. అదే విధంగా మంత్రులందరూ తమ వందరోజుల పాలన సందర్భంగా సమీక్షించుకోవాలని సీఎం సూచించారని తెలిపారు. అక్టోబర్ 2 నుంచి 1230 గ్రామాల్లో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. పింఛన్ల మంజూరుకు ఆధార్ కార్డులతో బయోమెట్రిక్ విధానాన్ని అనుసంధానం చేస్తామని పల్లె చెప్పారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, కల్లు గీత, చేనేత కార్మికుల పింఛన్ ను వెయ్యి రూపాయలుగా నిర్ణయించినట్టు ఆయన తెలిపారు.