: రూ.100 లక్షల కోట్లు... భారత కార్పొరేట్ ఆస్తుల విలువ!
భారత పరిశ్రమల మొత్తం విలువ రికార్డు స్థాయికి చేరుకుంటోంది. బాంబే స్టాక్ ఎక్సేంజీలో నమోదైన మొత్తం కంపెనీల విలువ రూ. 100 లక్షల కోట్లకు చేరువవుతోంది. ఆదివారం నాటికి ఈ విలువ రూ. 96,25,517 కోట్లకు చేరింది. త్వరలోనే ఈ విలువ రూ. 100 లక్షల కోట్లకు చేరుకుంటుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రూ. 100 లక్షల కోట్ల మార్కు చేరుకోవడానికి కేవలం రూ. 3. లక్షల కోట్ల దూరంలో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీలు నిలిచాయి. ఇటీవల బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల షేర్ల విలువ శరవేగంగా పెరగుతుండటమే ఇందుకు దోహదం చేసిందని తెలుస్తోంది. అంతేకాక, మోడీ ప్రధానిగా పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం పెరగడం కూడా కంపెనీల విలువ పరుగులు పెట్టేందుకు కారణమైందని కూడా విశ్లేషణలు కొనసాగుతున్నాయి. తాజా గణాంకాల ప్రకారం అత్యధిక నెట్ వర్త్ కలిగిన కంపెనీగా టాటాల నేతృత్వంలోని టీసీఎస్ (రూ. 5,10,415.13 కోట్లతో) తొలి స్థానంలో ఉంది.