: టీడీపీ దిశగా పురందేశ్వరి అడుగులు!
దివంగత నందమూరి తారక రామారావు తనయ, బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి, తన తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీలోకి అడుగిడేందుకు ఆసక్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. దగ్గుబాటి కుటుంబానికి టీడీపీ కొత్త కాకపోయినా, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో పొడచూపిన విబేధాలు ఇంకా సమసిపోలేదు. దీంతో పరిస్థితులు అనుకూలించాక, సొంత గూటికి చేరుకోవాలని పురందేశ్వరి, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు వేచి చూస్తున్నారు. ‘‘టీడీపీలోకి చేరిపోవాలనే ఉంది, కాని పరిస్థితులు అనుకూలించాలిగా?’’ అంటూ పురందేశ్వరి తన మనసులోని మాటను బయటపెట్టారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఈ దంపతులు, ప్రవాసాంధ్రులు నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజకీయాలను నెమరువేసుకున్న పురందేశ్వరి, టీడీపీలోకి చేరిపోయేందుకు సిద్ధంగానే ఉన్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పటికే ఎన్టీఆర్ తనయులనే పక్కకు నెట్టేసిన చంద్రబాబు, తనను వ్యతిరేకించి పార్టీ వీడిన దగ్గుబాటి దంపతులను తిరిగి పార్టీలోకి రానిస్తారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.