: ఎన్డీయే ప్రభుత్వాన్ని మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న మాజీ ఎంపీలు
మాజీ ఎంపీలు, కేంద్రమంత్రులు గత ప్రభుత్వం తమకు కేటాయించిన క్వార్టర్లను ఖాళీ చేయకుండా ప్రస్తుత ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన రాజకీయనాయకులు...ఢిల్లీలో అధికార నివాసాలను ఖాళీ చేసేందుకు ససేమిరా అంటున్నారు. దీంతో ప్రభుత్వం కొత్తగా ఎన్నికైన ఎంపీలకు...కేంద్రమంత్రులకు అధికారనివాసాలు కేటాయించలేక సతమతమవుతోంది...ఇటు చూస్తే కొత్త ఎంపీలు, మంత్రులు తమకు అధికారిక నివాసాలు కేటాయించాలంటూ కేంద్ర సర్కార్ మీద ఒత్తిడి తెస్తుండగా...అటు మాజీ ఎంపీలు ,కేంద్రమంత్రులు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా ఖాళీ చేయడం లేదు. దీంతో ప్రభుత్వం అడకత్తెరలో పోక చెక్కలాగా గిలగిలలాడుతోంది. వాస్తవానికి జూన్ నెలాఖరు నుంచి మాజీ మంత్రులు, ఎంపీలు తమ నివాసాలు ఖాళీ చేయాలని అనేకసార్లు ప్రభుత్వం నోటీసులు పంపింది. వీటికి మాజీఎంపీలు, మంత్రులు చీమకుట్టినంతయినా ప్రతిస్పందించ లేదు. దీంతో పోయిన నెల దగ్గరుండి ఖాళీ చేయిద్దామని వెళ్లిన అధికారులకు, మాజీ ఎంపీల అనుచరులతో గొడవపడటం తప్ప మరేం కలిసిరాలేదు. పోనీ పోలీసుల సహాయం తీసుకుని ఖాళీ చేయిద్దామనుకంటే అందరూ లబ్ద ప్రతిష్టులైన రాజకీయనాయకులే!... దీంతో సెప్టెంబర్ 5... మాజీ ఎంపీలు, మంత్రులు ఖాళీ చేయడానికి లాస్ట్ కట్ ఆఫ్ డేటని... ఈలోగా కచ్చితంగా ఖాళీ చేయాలని ప్రభుత్వం హెచ్చరించింది. సెప్టెంబర్ 5 గడిచి పది రోజులవుతున్నా ఘనచరిత్ర కలిగిన ఎంపీలు ఏమాత్రం ఉలకడం లేదు...పలకడం లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వీరి నివాసాలకు ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు వాటర్, కరెంట్ సరఫరాను బంద్ చేశారు. సుమారు 30 మంది మాజీ ఎంపీల నివాసాలకు నిన్నటి నుంచి కరెంట్... వాటర్ సరఫరా పూర్తిగా బంద్ అయ్యింది. కావూరి సాంబశివరావు, అజిత్ సింగ్, జితేంద్ర సింగ్, మహమ్మద్ అజారుద్దీన్, నీరజ్ శేఖర్, విజయ్ ఇందర్ సింగ్లా, అవతార్ సింగ్ భదానా, ధనంజయ్ సింగ్ తదితర మాజీ ఎంపీలు ప్రస్తుతం ఉంటున్న ఇళ్లకు అధికారులు విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేశారు.