: రాజధాని తరలింపు మరింత ఆలస్యం!


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని తరలింపు అటు ప్రభుత్వంతో పాటు ఇటు అధికారులకు కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు కొత్త రాజధాని అనివార్యమైన సంగతి తెలిసిందే. రాజధాని నిర్మాణం నెలలోనో, ఏడాదిలోనే పూర్తయ్యే విషయం కాదు. అయితే తాత్కాలికంగానైనా విజయవాడ నుంచి కార్యకలాపాలు సాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోచిస్తున్నారు. ఈ క్రమంలోనే కనీసం కొన్ని కార్యాలయాలనైనా, విజయవాడ తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ విషయంలో ఒక్క అడుగూ ముందుకు పడటం లేదు. కార్యాలయాల నిర్వహణకు అవసరమైన భవనాల లభ్యత ఇందులో కీలక అడ్డంకిగా మారింది. విజయవాడతో పాటు గుంటూరులోనూ రాష్ట్ర స్థాయి ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణకు అనువైన భవనాలు లేవు. ప్రైవేట్ భవనాల కోసమైనా వెదుకుతామంటే, భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో అధికారులు ధైర్యంగా ముందడుగు వేయలేకపోతున్నారు. ఇదిలా ఉంటే, హైదరాబాద్ నుంచి ఉన్న పళంగా విజయవాడ తరలివెళ్లేందుకు ఆయా శాఖల అధికారులు కూడా ఆసక్తి చూపడం లేదు. ఏపీ రాజధానిని విజయవాడ పరిసరాల్లోనే నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అక్కడ అద్దెలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇక విద్యా సంవత్సరం మధ్యలో ఉండటంతో పిల్లల చదువులకు ఇబ్బంది వస్తుందన్న అంశం కూడా వారిని వెనుకంజ వేసేలా చేస్తోంది. ఈ నేపథ్యంలో మరో నాలుగైదు నెలలు గడిస్తేనే రాష్ట్ర పాలన పాక్షికంగానైనా విజయవాడ తరలివెళ్లే పరిస్థితి కనిపించడం లేదు.

  • Loading...

More Telugu News