: మణిపూర్ లో ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తోన్న తెలుగు విద్యార్థులు
మణిపూర్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకుంటున్న 70 మంది తెలుగు విద్యార్ధులపై స్థానిక విద్యార్ధులు దాడి చేశారు. దాడులు గత నాలుగు రోజులుగా కొనసాగుతున్నాయి. స్థానిక పోలీసులకు... కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో తెలుగు విద్యార్ధులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కళాశాలలోని హాస్టల్ లో కాలం వెళ్లదీస్తున్నారు. చాలా మంది విద్యార్థులు తీవ్రగాయాలతో బాధపడుతున్నారు. బయటకు వచ్చి చికిత్స చేయించుకునే పరిస్థితి లేకపోవడంతో వారంతా హాస్టళ్లలోని రహస్య ప్రదేశాలలో కాలాన్ని గడుపుతున్నారు. ముఖ్యంగా, గత ఇరవై నాలుగ్గంటలుగా చాలా మంది విద్యార్ధులు ప్రాణభయంతో హాస్టల్ లోని ఓ బాత్ రూమ్ లో దాక్కున్నారు. తెలుగు విద్యార్ధుల మొబైళ్లు, ల్యాప్ టాప్ లను స్థానిక విద్యార్ధులు హస్తగతం చేసుకోవడంతో సమాచారం అందించడానికి కూడా తెలుగు విద్యార్థులకు గత కొన్ని రోజులుగా అవకాశం లేకుండా పోయింది. అయితే, ఆఖరికి ఓ విద్యార్థి ఎట్లాగో ధైర్యం చేసి ఈరోజు తెలుగు టీవీ చానళ్లకు సమాచారం అందించడంతో... విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు వెంటనే అప్రమత్తమయ్యారు. తెలుగు విద్యార్థులకు వెంటనే భద్రత కల్పించాల్సిందిగా కేంద్ర హోం శాఖతో పాటు మణిపూర్ రాప్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆయన కోరారు. పరిస్థితులు అదుపులోకి రాకపోతే... విద్యార్థులను వెంటనే వెనక్కి తీసుకువచ్చేందుకు కంభంపాటి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే, తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ.... తెలుగు విద్యార్థులకు రక్షణ కల్పించాల్సిందిగా మణిపూర్ డీజీపీని కోరారు. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ చాలా సెన్సిటివ్ ఏరియా. ఇక్కడ చిన్న చిన్న విషయాలు కూడా చాలా పెద్ద గొడవకు దారి తీస్తాయి. స్థానికులు... స్థానికేతరులు మధ్య గొడవలు ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటాయి. స్థానికేతరులు తమ క్రింద అణిగిమణిగి ఉండాలని... తాము చెప్పింది చేయాలనే ధోరణి ఇక్కడి ప్రాంతీయుల్లో బలంగా ఉంది. అలాగే, మణిపూర్ లో స్థానికంగా ఒక ఊరంటే మరొక ఊరుకు పడకపోవడం... ఒక జిల్లా వాసులకు మరొక జిల్లా వాసులంటే పడకపోవడం...ఇలా అడుగడుగునా ప్రాంతీయ విద్వేషాలు కనిపిస్తాయి.