: ప్రభుత్వ కార్యకలాపాల్లో జీమెయిల్, యాహూ, హాట్ మెయిళ్లపై బ్యాన్
అత్యంత ప్రజాదరణ పొందిన జీమెయిల్, యాహూ మెయిల్ లను ప్రభుత్వ కార్యకలాపాలు, వ్యవహారాల్లో వాడటాన్ని నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. రహస్యంగా ఉంచాల్సిన కీలక ప్రభుత్వ డేటాను పరిరక్షించుకునే ఉద్దేశంతో... ఇకపై జీమెయిల్, యాహూ, హాట్ మెయిల్ లాంటి సర్వీసులకు దూరంగా ఉండాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా ఓ నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై కేంద్ర ఎలక్ర్టానిక్స్, సమాచార సాంకేతిక పరిజ్ఞాన విభాగం... కేంద్ర కేబినెట్‌కు ఇప్పటికే ఓ ప్రతిపాదన పంపింది. ఈ విధానం పూర్తిస్థాయిలో అమలుకు సుమారు రూ.100 కోట్ల బడ్జెట్ ప్రతిపాదనను ఈ విభాగం కేంద్రానికి పంపింది. ఈ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం లభించాక ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ -ఎన్ఐసీ సెంటర్ ఆధారంగా జరుగుతాయి. ఈ క్రమంలోనే, త్వరలో ఆరు నుంచి ఏడు లక్షల మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్ఐసీ అందించే అధికారిక ఈ మెయిల్ సర్వీస్‌ను వినియోగించాల్సి వుంటుంది. ఇప్పటికే రక్షణశాఖకు సురక్షితమైన సొంత ఈమెయిల్ సర్వర్ వ్యవస్థ వుంది. విదేశీ వ్యవహారాల శాఖ కూడా సొంత ఈమెయిల్ సర్వర్ వ్యవస్థ ఏర్పాటుకు ప్రయత్నాలు ఆరంభించింది. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం దిశగా ఆలోచించడానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. మొదటి కారణం, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ క్రైమ్ నేరాలు, హ్యాకింగ్ సంఘటనలు. ఉదాహరణకు ఈ వారం ఆరంభంలో సుమారు 50 లక్షల జీమెయిల్ యూజర్స్ కు చెందిన ఈ మెయిల్ ఐడీ, పాస్ వర్డ్ లను రష్యన్ హ్యకర్లు ఆన్ లైన్ లో విడుదల చేశారు. ఇలాంటి సంఘటనలు విరివిగా జరుగుతోన్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఇక రెండోది... భారత్ తో పాటు ప్రపంచదేశాలకు సంబంధించిన ఇంటర్ నెట్ డేటాను అమెరికన్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఓ సీక్రెట్ ప్రోగ్రామ్ ద్వారా నిరంతరం మానిటర్ చేస్తున్నాయి. వీటి వల్ల దేశ అంతర్గత భద్రతకు, సమగ్రతకు ముప్పువాటిల్లే అవకాశం ఉందని భావించి సొంత సర్వర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది.