: పథకం ప్రకారమే వైఎస్సార్సీపీ నేతలపై దాడులు: చెవిరెడ్డి
చిత్తూరు జిల్లా నగరిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని, ఆ దాడిని ఖండిస్తున్నామని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. పథకం ప్రకారమే వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు, నగరిలో అమ్మవారి జాతరకు స్థానిక ఎమ్మెల్యే హోదాలో రోజా హాజరయ్యారు. జాతర చివరిరోజున అమ్మవారికి ఎమ్మెల్యే హారతి ఇవ్వడం రివాజు. అయితే, రోజా హారతి ఇచ్చే క్రమంలో జాతర ప్రధాన నిర్వాహకుడు కుమరేశన్... రోజాను అడ్డుకున్నాడని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ గొడవలో రోజా చేతికి గాయమైందని, అందుకు, టీడీపీ కార్యకర్తలే కారణమంటూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.