: సల్మాన్ 'బిగ్ బాస్' కార్యక్రమాన్ని బహిష్కరించిన ఫొటోగ్రాఫర్లు
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు, ఫొటోగ్రాఫర్లకు మధ్య వివాదం మరింత పెరుగుతోంది. తాజాగా, ముంబయిలో జరిగిన సల్మాన్ 'బిగ్ బాస్ 8' మీడియా సమావేశానికి ఫొటోగ్రాఫర్లు హాజరుకాలేదు. దీనిపై సల్లూ స్పందిస్తూ, ఫొటోగ్రాఫర్ల నిర్ణయం తనకు నష్టదాయకమైనప్పటికీ వారి నిర్ణయాన్ని గౌరవిస్తానన్నాడు. తాను వారిపై ఎలాంటి నిషేధం విధించలేదని, వారే తనను బహిష్కరించారని చెప్పాడు. అయితే, ఆ వివాదం శాంతియుతంగా పరిష్కారం కావాలని మీరనుకుంటున్నారా? అని విలేకరులు ప్రశ్నించగా, ముందు వారు శాంతియుతంగా ఉండడం అవసరం అన్నాడు. వారు మర్యాదగా వ్యవహరించినన్ని రోజులు తాను కూడా వారితో బాగానే ఉంటానని చెప్పాడు. కానీ, తాను పాల్గొన్న కార్యక్రమాన్ని ఫొటోగ్రాఫర్లు చేపల మార్కెట్ గా చేయడాన్ని మాత్రం అంగీకరించనని సల్మాన్ పేర్కొన్నాడు. గత నెలలో 'కిక్' ప్రమోషన్ కార్యక్రమంలో సల్మాన్ బౌన్సర్లు ఫొటోగ్రాఫర్లపై దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఫొటోగ్రాఫర్లు సల్మాన్ ప్రెస్ మీట్లకు దూరంగా ఉంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.