: కేంద్ర మాజీ మంత్రి ఇంటికి నీరు, విద్యుత్ సరఫరా బంద్!
రాష్ట్రీయ లోక్ దళ్ నేత, కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ ఇబ్బందికర పరిస్థితుల్లో పడ్డారు. ఆయన ఉంటున్న ఇంటికి నీరు, విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులో గత ప్రభుత్వం కేటాయించిన ఇంటిలో ప్రస్తుతం ఆయన ఉంటున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన అజిత్ ఇప్పటికీ అదే ఇంటిలో నివసిస్తున్నారు. తాజాగా, ఆ ఇంటిని కేంద్ర క్రీడా శాఖ మంత్రి సర్బానంద సోనొవాల్ కు కేటాయించారు. దాంతో, నివాసాన్ని ఖాళీ చేయాలని జులైలో అధికారులు అజిత్ కు నోటీసు ఇచ్చారు. అయినా వెళ్లకపోవడంతో కొన్నిరోజుల కిందట ఖాళీ చేయించాలని ఢిల్లీ పోలీసులు ప్రయత్నించారు కూడా. కానీ, ఆయన మద్దతుదారుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఈ క్రమంలోనే మంత్రి ఇంటికి నీరు, విద్యుత్ సరఫరాను ఆపేసినట్టు సమాచారం.